Australia: ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్ ను నేలకు దింపిన కంగారూలు!
- యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లాండ్ కు ఘోర పరాభవం
- 251 పరుగులతో ఆసీస్ ఘనవిజయం
- 5 టెస్టుల సిరీస్ లో 1-0 తో ముందంజ
ఇటీవలే వరల్డ్ కప్ గెలిచి గాల్లో తేలిపోతున్న ఇంగ్లాండ్ కు టెస్టుల్లో షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 251 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఎడ్జ్ బాస్టన్ లో 398 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్ 6, ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టును హడలెత్తించారు. ఇంగ్లాండ్ జట్టు మొత్తాన్ని ఈ ఇద్దరే ఆలౌట్ చేశారు.
ఇంగ్లాండ్ జట్టులో క్రిస్ వోక్స్ (38) టాప్ స్కోరర్. ఈ మ్యాచ్ లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 374 పరుగులతో బదులిచ్చింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆసీస్ 487/7 వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్నుంచింది. కానీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఏ దశలోనూ పోరాడుతున్నట్టు కనిపించలేదు. లయన్, కమిన్స్ ధాటికి బ్యాట్లెత్తేశారు.
కాగా, ఆసీస్ ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే స్టీవెన్ స్మిత్ ఆటేనని చెప్పాలి. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీలు సాధించి ఆసీస్ ను గెలుపుబాటలో నిలిపాడు. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ లో కంగారూలు 1-0తో ఆధిక్యంలో నిలిచారు.