Jammu And Kashmir: ఎల్ఓసీకి భారీగా బలగాలను తరలిస్తున్న భారత్... నేడు పాక్ పార్లమెంట్ అత్యవసర సమావేశం!
- ఆర్టికల్ 370 రద్దు తప్పుడు నిర్ణయం
- కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందనుకుంటే అత్యాశే
- పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇండియా ప్రభుత్వ వైఖరి, ఆ దేశ సైనికుల దాష్టీకాలతో ఇబ్బందులు పడుతున్న కాశ్మీర్ ప్రజలకు తమ దేశం అండగా నిలబడుతుందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దును ఓ తప్పుడు నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. దీంతో కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తే, అది అత్యాశే అవుతుందన్నారు. కాగా, తాజా పరిస్థితులపై చర్చించేందుకు పాకిస్థాన్ పార్లమెంట్ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కశ్మీరీలకు మద్దతివ్వాలని ఈ సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించవచ్చని సమాచారం.
ఇదిలావుండగా, వాస్తవాధీన రేఖకు భారత ప్రభుత్వం మరింత మంది సైన్యాన్ని తరలిస్తోంది. ఎల్వోసీ వద్ద సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని సైనికాధికారి ఒకరు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం నుంచి సూచనలు అందాయని, అందుకు తగ్గట్టుగానే మరిన్ని బలగాలను తరలించినట్టు వెల్లడించారు. పాకిస్థాన్ ఎటువంటి దుస్సాహసానికి ఒడిగట్టినా, గట్టి సమాధానం ఇచ్చేందుకు సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
మరోవైపు జమ్మూ కశ్మీర్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఏ క్షణమైనా ఉగ్రవాద దాడులు జరుగవచ్చని, స్థానికులు కొందరు అల్లర్లకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఐబీ వర్గాలు హెచ్చరించడంతో, రాష్ట్రంలో పహారా కాస్తున్న సైనికులు అప్రమత్తం అయ్యారు. శ్రీనగర్, జమ్మూ, పూంఛ్, రాజౌరీ తదితర ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్, కొన్ని సునిశిత ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.