Article 370: నేడు లోక్ సభ ముందుకు ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన బిల్లులు
- నిన్న రాజ్యసభలో గట్టెక్కిన బిల్లులు
- లోక్ సభలో బీజేపీకి పూర్తి మెజార్టీ
- దిగువ సభలో బిల్లులు గట్టెక్కడం నల్లేరు మీద నడకే
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన బిల్లులకు నిన్న రాజ్యసభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ బిల్లులు లోక్ సభ ముందుకు వస్తున్నాయి. లోక్ సభలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో ఈ బిల్లు గట్టెక్కడం నల్లేరు మీద నడకే. మరోవైపు, పలు పార్టీలు కూడా ఈ బిల్లుల విషయంలో బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయి. లోక్ సభలో బిల్లులకు ఆమోదం లభించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం రాష్ట్రపతి భవన్ కు వెళ్తుంది. రాష్ట్రపతి సంతకం చేశాక చట్ట రూపం దాల్చుతుంది.
రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు. జమ్ముకశ్మీర్ విభజన బిల్లు కోసం ఓటింగ్ నిర్వహించగా... ఆర్టికల్ రద్దుకు అనుకూలంగా 125 ఓట్లు పడ్డాయి. 61 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. జమ్ముకశ్మీర్ లో పరిస్థితులు చక్కబడ్డ తర్వాత అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న రాజ్యసభలో తెలిపారు.