Ladakh: కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో లడఖ్ లో ఆకాశాన్నంటిన సంబరాలు!

  • కశ్మీర్ నుంచి విడగొట్టాలని 7 దశాబ్దాలుగా పోరాడుతున్న లడఖ్ ప్రజలు
  • ఇంత కాలానికి తమ కల నెరవేరిందంటూ ఆనందోత్సాహాలు
  • మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటూ కితాబు

జమ్ముకశ్మీర్ నుంచి విడగొట్టి తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంపై లడఖ్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాచరణతో లడఖ్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. జనాలంతా రోడ్లపైకి వచ్చి ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇంతకాలానికి లడఖ్ ప్రజల కల నెరవేరిందని లడఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్ తెలిపింది.

బుద్దిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కున్ జాంగ్ మాట్లాడుతూ, తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తుండటంతో... ఇంత కాలానికి తమ కల నెరవేరిందని చెప్పారు. ఈరోజు కోసం తామంతా ఎంతగానో ఎదురు చూశామని అన్నారు. జమ్ముకశ్మీర్ నుంచి విడిపోవాలని, తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని తాము 1949 నుంచి ఆరాటపడుతున్నామని తెలిపారు. ఈ 70 ఏళ్ల కష్ట సమయంలో తమ కలను నెరవేర్చుకునేందుకు తాము ఎన్నో పోరాటాలు చేశామని... ఆలస్యంగానైనా తమ కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన ఘనత బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వానికే దక్కుతుందని కున్ జాంగ్ అన్నారు. గత 7 దశాబ్దాలలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి, పోయాయని... కానీ తాము మాత్రం బాధితులుగా మాత్రమే మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ఈరోజు ప్రధాని మోదీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని... లడఖ్ ప్రజలంతా మోదీకి, బీజేపీకి కృతజ్ఞులుగా ఉంటామని చెప్పారు.

కేంద్రపాలిత ప్రాంతమనేది లడఖ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కానుక అని లడఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ వంగ్యాల్ తెలిపారు. లడఖ్ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామమని అన్నారు. లడఖ్ భవిష్యత్ తరాల కోసం తమ పూర్వీకులు చేసిన పోరాటాలకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన కానుక ఇది అని తెలిపారు. లడఖ్ ప్రజలు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పడానికి తనకు మాటలు రావడం లేదని అన్నారు. కశ్మీర్ నుంచి లడఖ్ ను వేరు చేయాలని 7 దశాబ్దాలుగా తాము చేస్తున్న పోరాటానికి ఇప్పుడు ఫలితం దక్కిందని చెప్పారు.

  • Loading...

More Telugu News