Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ లోని మూడు కుటుంబాలకే ‘370’ రక్షణగా నిలిచింది: అమిత్ షా
- జమ్ముకశ్మీర్ ప్రజలను పేదరికంలో ఉంచేందుకు కొన్ని శక్తుల యత్నం
- జమ్ముకశ్మీర్ అభివృద్ధికి కేంద్రం పంపిన నిధులు ఏమయ్యాయి?
- మౌలిక వసతులు కల్పించలేదు
జమ్ముకశ్మీర్ లోని మూడు కుటుంబాలకే ఆర్టికల్ 370 రక్షణగా నిలిచిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్ ప్రజలను పేదరికంలో ఉంచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి కేంద్రం పంపించిన నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. ఆ నిధులతో జమ్ముకశ్మీర్ గ్రామాల్లో ఎలాంటి మార్పు రాలేదని, మౌలిక వసతులు కల్పించలేదని అన్నారు.
జమ్ముకశ్మీర్ లో బాల్య వివాహాలు కొనసాగుతుండడం ఎంతవరకు సమంజసం అని, వివాహ వయసు దేశమంతా ఒకలా ఉంటే, జమ్ముకశ్మీర్ లో మరోలా ఉందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో మోదీ పాలనలో జమ్ముకశ్మీర్ లో అభివృద్ధి చూస్తారని, ఈ ఆర్టికల్ వల్ల ఎంత నష్టపోయామో కశ్మీర్ అర్థం చేసుకుంటారని చెప్పారు.
ఈ సందర్భంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా విమర్శలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా చారిత్రక తప్పు చేశారని అసదుద్దీన్ వ్యాఖ్యానించారని, దీన్ని రద్దు చేయడం ద్వారా జరిగిన తప్పును తాము సరిచేశామనే అంశం భావితరాలకు తెలుస్తుందని అన్నారు.