India: ఇది మా అంతర్గత వ్యవహారం: చైనా వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన భారత్
- ఆర్టికల్ 370 రద్దుపై చైనా అసహనం
- ప్రతిస్పందించిన భారత విదేశాంగ శాఖ
- ఇతర దేశాలు వ్యాఖ్యలు చేయడాన్ని భారత్ కోరుకోవడంలేదని వెల్లడి
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై చైనా తన అల్పబుద్ధిని బయట పెట్టుకున్న సంగతి తెలిసిందే. భారత్ నిర్ణయం తమ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని అణగదొక్కే విధంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేసింది. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ దీటుగా బదులిచ్చారు.
జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లు-2019ని భారత ప్రభుత్వం ఆగస్టు 5న పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, లఢఖ్ ప్రాంతాన్ని సరికొత్త కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో పొందుపరిచారని రవీష్ కుమార్ వివరించారు. ఈ నిర్ణయం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారం అని చైనా వ్యాఖ్యలను తిప్పికొట్టారు. భారత్ పాలన పరమైన అంశాల్లో చైనా స్పందనలకు తావులేదని ఆయన చెప్పకనే చెప్పారు. భారత్ ఏ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని, వ్యాఖ్యలు చేయదని, ఇతర దేశాలు కూడా తన పట్ల అలాగే ఉండాలని భారత్ కోరుకుంటుందని రవీష్ కుమార్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.