Congress: రాబోయే రోజుల్లో చాలామంది కాంగ్రెస్ నేతలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించే అవకాశం ఉంది: విజయశాంతి
- ఆర్టికల్ 370 రద్దు పట్ల సానుకూలంగా స్పందించిన జ్యోతిరాదిత్య సింధియా
- కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన జనార్దన్ ద్వివేది
- జమ్మూకశ్మీర్ విభజనను మెజారిటీ కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతిస్తున్నారన్న విజయశాంతి
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల స్పందించడంలో కాంగ్రెస్ పార్టీలో భిన్న వైఖరులు కనిపిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ ను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించగా, కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ద్వితీయ స్థాయి నాయకత్వం మాత్రం కేంద్రం నిర్ణయాన్ని సమర్ధిస్తుండడం ఆశ్చర్యకర పరిణామం. ఇప్పటికే యువనేత జ్యోతిరాదిత్య సింధియా ఆర్టికల్ 370 రద్దును స్వాగతించారు. మరోవైపు, సీనియర్ నేత జనార్దన్ ద్వివేది కూడా సానుకూలంగా స్పందించారు.
దీనిపై విజయశాంతి స్పందిస్తూ, రాబోయే రోజుల్లో కేంద్రం నిర్ణయాన్ని మరింతమంది కాంగ్రెస్ నేతలు స్వాగతించే అవకాశాలున్నాయని చెప్పారు. జమ్మూకశ్మీర్ విభజనను కాంగ్రెస్ కార్యకర్తల్లో అత్యధికులు అభినందిస్తున్నారని వివరించారు. రాజకీయపరంగా ఎన్ని విభేదాలు ఉన్నా, దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదన్నది కాంగ్రెస్ అంతస్సూత్రం అని విజయశాంతి వివరించారు.