team india: మూడో టీ20 కూడా భారత్‌దే.. సిరీస్ వైట్‌వాష్!
- రాణించిన కోహ్లీ..చితక్కొట్టిన రిషభ్ పంత్
- ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా దీపక్ చాహర్
- రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఫ్లోరిడాలో విండీస్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు గయానాలో మంగళవారం జరిగిన చివరి టీ20లోనూ విజయం సాధించి విండీస్‌ను వైట్ వాష్ చేసింది. గత రెండు మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలమైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌తోపాటు కెప్టెన్ కోహ్లీ చెలరేగి ఆడడంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు బౌలింగ్‌లో దీపక్ చాహర్ వీర విజృంభణ చేసి విండీస్ బ్యాట్స్‌మన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. మూడు ఓవర్లు వేసిన చాహర్ ఒక మెయిడెన్ తీసుకుని నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ 58, రోవ్‌మన్ పావెల్ 32 పరుగులు చేశారు.
అనంతరం 147 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. లోకేశ్ రాహుల్ 20, కోహ్లీ 59, రిషభ్ పంత్ 65 పరుగులు చేశారు. అద్భుత స్పెల్‌తో అదరగొట్టిన దీపక్ చాహర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.