RBI: మరోసారి రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ!
- 35 బేసిస్ పాయింట్ల తగ్గింపు
- ద్రవ్యోల్బణం దిగొచ్చిన కారణంతోనే
- వెల్లడించిన శక్తికాంత్ దాస్
కీలకమైన రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిసేపటిక్రితం ప్రకటించింది. నిన్నటి నుంచి జరుగుతున్న పరపతి విధాన సమీక్ష నేడు ముగియడంతో సమావేశంలో తీసుకున్న వివరాలను ఆర్బీఐ మీడియాకు విడుదల చేసింది. ప్రస్తుతం 5.75 శాతంగా ఉన్న రెపో రేటును 5.40 శాతానికి, 5.50 శాతంగా ఉన్న రివర్స్ రెపో రేటును 5.15 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపింది. దీంతో వరుసగా నాలుగోసారి పరపతి సమీక్షలో వడ్డీ రేటు తగ్గినట్లయింది.
చిల్లర ధరల ద్రవ్యోల్బణం 3.18 శాతానికి తగ్గడం, ఇది ఆర్బీఐ విధించుకున్న టార్గెట్ 4 శాతం కన్నా చాలా తక్కువ కావడంతోనే వడ్డీ రేట్లను తగ్గించేందుకు అవకాశం లభించిందని ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు. తగ్గించిన వడ్డీ రేటు ప్రయోజనాలను బ్యాంకులు వెంటనే కస్టమర్లకు అందించాలని ఆయన సూచించారు.
కాగా, ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు స్వల్పంగా తగ్గే అవకాశలు ఉన్నాయి. ఇదే సమయంలో ఫిక్సెడ్ బ్యాంక్ డిపాజిట్లపై బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ మొత్తం కూడా తగ్గుతుంది.