Guntur: వైసీపీ శ్రేణులు బెదిరిస్తే టీడీపీ కార్యకర్తలు ఊళ్లు వదిలేసి వెళ్లాలా?: చంద్రబాబు ఆగ్రహం
- మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేస్తే మీరెక్కడ ఉండేవాళ్లు?
- రేపు మేము అధికారంలోకొస్తే వాళ్లు కూడా గ్రామాలు వదిలిపెట్టి పోతారా?
- ఏదైనా ఊళ్లో మా కార్యకర్తలకు భద్రత లేదని భావిస్తే అక్కడే బస చేస్తా
ఏపీలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ శ్రేణులు బెదిరిస్తే టీడీపీ కార్యకర్తలు ఊళ్లు వదిలేసి వెళ్లాలా? రేపు తాము అధికారంలోకి వస్తే వాళ్లు కూడా గ్రామాలు వదిలిపెట్టి పోతారా? అని ప్రశ్నించారు. ఏదైనా ఊళ్లో టీడీపీ కార్యకర్తలకు భద్రత లేదని భావిస్తే తాను ఆ ఊళ్లోనే బస చేస్తానని, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే తిరిగి వెళతానని చెప్పారు.
‘మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేస్తే మీరెక్కడ ఉండేవాళ్లు?’ అని ప్రశ్నించారు. పోలీసులు ఏం చేస్తున్నారు? బాధ్యత లేదా మీకు? అంటూ మండిపడ్డారు. దాడులు ఇలానే కొనసాగితే ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విధంగా ఎదుర్కొంటామని, టీడీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తమపై తప్పుడు కేసులు పెడితే, తిరిగి కేసులు పెడదామని, ఆ కేసులను స్వీకరించకపోతే, కోర్టును ఆశ్రయించి న్యాయం పొందే వరకు ఎవరినీ వదిలిపెట్టనని, తమ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.