Akhand Bharat: పాకిస్థాన్ రాజధానిలో 'అఖండ భారత్' ఫ్లెక్సీలు.. కలకలం!
- అఖండ భారత్ దిశగా ముందడుగు అంటూ ఫ్లెక్సీలు
- ఇస్లామాబాద్ లో పలు చోట్ల వెలసిన ఫ్లెక్సీలు
- ఫ్లెక్సీలను తొలగించిన పోలీసులు
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై పాకిస్థాన్ ప్రభుత్వం, పాక్ సైన్యం ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, ఆ దేశంలోని కొందరు భారత్ చర్యలను సమర్థిస్తున్నారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో ఇండియాకు అనుకూలంగా ఫ్లెక్సీలు దర్శనమివ్వడం సంచలనం రేకెత్తించింది. ఇస్లామాబాద్ లోని ప్రెస్ క్లబ్, సెక్టార్ ఎఫ్-6, అబ్ పారా చౌక్ ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.
'మహాభారత్ దిశగా ముందడుగు' అని బ్యానర్లో పేర్కొన్నారు. అంతేకాదు, అఖండ భారత్ లక్ష్యాన్ని ప్రధాని మోదీ పూర్తి చేయాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను బ్యానర్ పై ప్రింట్ చేశారు. ఈ బ్యానర్లను స్థానికులు చాలా సేపు ఆసక్తికరంగా చూశారు. ఆ తర్వాత కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... వారు వచ్చి ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ లోని ప్రముఖ పత్రిక డాన్ ప్రచురించింది. మరోవైపు, దీనికి సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.