Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లో నిషేధాజ్ఞల తొలగింపు యోచనలో కేంద్రం
- సోమవారం బక్రీద్ నేపథ్యంలో ఆంక్షల సడలింపు యోచన
- పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్న అజిత్ ధోవల్
- నిషేధాజ్ఞల సడలింపు జాబితా సిద్ధం
బక్రీద్ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాజ్ఞలను తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సోమవారం ప్రజలు బక్రీద్‌ను జరుపుకునేలా చర్యలు తీసుకోనున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి నిషేధ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. చెదురుమదురు సంఘటనలు మినహా కశ్మీర్లో పరిస్థితులు అదుపులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బక్రీద్ కోసం నిషేధాజ్ఞలను తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిషేధ ఉత్తర్వుల సడలింపు కోసం స్థానిక యంత్రాంగం ఇప్పటికే జాబితాను సిద్ధం చేసింది.
ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఆయన స్వయంగా కశ్మీర్ వీధుల్లో తిరిగి భద్రతా పరమైన అంశాలను పర్యవేక్షించారు. స్థానికులతో కలిసి మాటలు కలిపారు. వారితో కలిసి భోజనం చేస్తూ తాజా పరిస్థితులపై ఆరా తీశారు. నిషేధాజ్ఞల వల్ల నిత్యావసరాల విషయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే వాటిని సడలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.