mumbai: నిండు గర్భిణిని రక్షించేందుకు రైల్వే ప్లాట్‌ఫాంపైకి ఆటో.. అరెస్ట్ చేసిన పోలీసులు!
- ముంబై, విరార్ రైల్వే స్టేషన్ లో ఘటన
- సాయం చేయడానికి ముందుకొచ్చిన ఆటోవాలా
- మందలించి వదిలిపెట్టిన న్యాయస్థానం
సాయం చేయాలన్న తపన ఉండాలే కానీ నిబంధనలు అడ్డంకి కావని నిరూపించాడో ఆటో డ్రైవర్. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఘటన ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్లో ఈ నెల 4న జరిగింది. అయితే, చూస్తూ ఊరుకోని చట్టం నిబంధనలు అతిక్రమించాడంటూ ఆ ఆటోడ్రైవర్‌ను అరెస్ట్ చేసింది.
నిండు గర్భిణి అయిన తన భార్యతో కలిసి ఓ వ్యక్తి ముంబై లోకల్ రైలులో ప్రయాణిస్తున్నాడు. వర్షాలు భారీగా కురుస్తుండడంతో రైలును విరార్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. అదే సమయంలో ఆ మహిళకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలియని భర్త స్టేషన్ బయటకు వచ్చి సాయం కోసం ఎదురుచూశాడు. అక్కడే ఉన్న సాగర్ కమలాకర్ గవాడ్ (34) అనే ఆటో డ్రైవర్‌ను కలిసి పరిస్థితిని వివరించాడు.
అతడి బాధను అర్థం చేసుకున్న కమలాకర్ రైల్వే నిబంధనలు పక్కనపెట్టి ఆటోను రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపైకి తీసుకెళ్లి పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. అయితే, నిబంధనలు ఉల్లంఘించి ఆటోను రైల్వే ప్లాట్‌ఫాం పైకి తీసుకెళ్లిన కమలాకర్‌ను ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విషయం తెలుసుకున్న న్యాయమూర్తి కమలాకర్‌ను హెచ్చరించి బెయిలుపై విడుదల చేశారు. అయితే, ఓ మహిళ ప్రాణాలను కాపాడడానికి అతడు చేసిన సాహసాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.