West Godavari District: టార్గెట్ కోటి రూపాయలు సంపాదించడం... 20 లక్షలు కొట్టేసి దొరికిపోయారు!
- జువైనల్ హోమ్ లో పరిచయం
- జీవితంలో సెటిల్ అవ్వాలన్న ఆశతో దొంగతనాలు
- పోలీసుల తనిఖీల్లో పట్టుబడి మళ్లీ జైలుకు
వారంతా చిన్నప్పుడు నేరాలు చేసి, జువైనల్ హోమ్ కు వెళ్లినవారు. అక్కడే అందరికీ పరిచయం ఏర్పడింది. స్నేహితులుగా మారారు. బయటకు వెళ్లిన తరువాత ఎలాగైనా కోటి రూపాయలు సంపాదించాలని, ఆపై ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయి జీవించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బయటకు వచ్చి అనుకున్న పని మొదలు పెట్టారు. దొంగతనాలు చేస్తూ, రూ. 20 లక్షలు సంపాదించారు. ఆపై పోలీసులకు పట్టుబడ్డారు.
ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం, తాడేపల్లిగూడెంకు చెందిన గుత్తుల రవికుమార్ అలియాస్ రవి (19), ఏలూరుకు చెందిన దత్తి నవీన్ అలియాస్ సంజు (20), ఓ బాలుడు (17), జంగారెడ్డిగూడెంకు చెందిన పోలవరపు నాగ దుర్గాప్రసాద్ (20)లకు జువైనల్ హోమ్ లో పరిచయం ఏర్పడగా, అందరూ స్నేహితులయ్యారు. వీరంతా బయటకు వచ్చి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల దొంగతనం, ఇళ్లలో దూరి కనిపించిన ఆభరణాలు, నగలు ఎత్తుకెళ్లడం వంటి చర్యలకు పాల్పడ్డారు. బంగారాన్ని ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టారు.
ముందుగా రెక్కీ నిర్వహించి, ఆపై రాత్రి పూట12 నుంచి రెండున్నర గంటల సమయంలో వీరు దోపిడీకి పాల్పడుతుంటారు. బైక్ లను అపహరించి, వాటిల్లో పెట్రోల్ ఉన్నంతవరకూ వాడుకుని, ఆపై దాన్ని వదిలేసి వెళ్లిపోవడం వీరి అలవాటు. ఇటీవలి కాలంలో దొంగతనాల సంఖ్య పెరగడంతో పోలీసులు ఈ టీమ్ పై గట్టి నిఘా పెట్టారు. రహదారి తనిఖీలు చేస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన రవికుమార్, నవీన్, మరో బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారి లక్ష్యం గురించిన వివరాలు బయటకు వచ్చాయి.
వారి నుంచి 54 కాసుల బంగారు వస్తువులు, ఐదు బైక్ లు, రూ. 34 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 19.4 లక్షలు అని అధికారులు వెల్లడించారు. వీరు దొంగిలించిన సొత్తులో సొంత ఖర్చులకు ఏమీ వాడుకోలేదని, తమ టార్గెట్ ను పూర్తి చేయడమే వీరి లక్ష్యమని పోలీసులు తెలిపారు.