ladakh: ఫేస్బుక్ ప్రెండ్ రిక్వెస్టులు 5 వేలు దాటిపోయాయి.. ఇక నావల్ల కాదు: లడఖ్ యువ ఎంపీ
- లోక్‌సభలో ప్రసంగంతో దేశ దృష్టిని ఆకర్షించిన యువ ఎంపీ
- తన ప్రసంగంలో లడఖ్ ప్రజల కష్టాలను వివరించిన బీజేపీ నేత
- ఒక్కసారిగా పెరిగిన ఫాలోవర్ల సంఖ్య
ఆర్టికల్ 370పై చర్చ సందర్భంగా లోక్‌సభలో ఒకే ఒక్క ప్రసంగంతో దేశం దృష్టిని ఆకర్షించారు లడఖ్ బీజేపీ యువ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నమ్గ్యాల్. లోక్‌సభలో ఆయన చేసిన ప్రసంగం ఆయనను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. ఆయనపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు పెరిగిపోయారు. ఆయన ఫేస్బుక్ ఖాతా అయితే ఫ్రెండ్ రిక్వెస్టులతో పోటెత్తుతోంది. దీంతో బీజేపీ ఎంపీ స్పందించారు.
రిక్వెస్టులను తానిక యాక్సెప్ట్ చేయలేనని, ఇప్పటికే ఆ సంఖ్య 5 వేలకు దాటిపోయిందని పేర్కొన్నారు. కాబట్టి తన అధికారిక పేజీని విజిట్ చేస్తూ, లైకులతో సరిపెట్టుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన లోక్‌సభలో ఆర్టికల్ 370పై మాట్లాడుతూ.. కేంద్రపాలిత ప్రాంతం కోసం లడఖ్ ప్రజలు ఏడు దశాబ్దాలుగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. లడఖ్ అభివృద్ధికి నోచుకోకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అలాగే, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులను కూడా తన ప్రసంగంలో తూర్పారబట్టారు. ఆయన ప్రసంగానికి దేశం మొత్తం ఫిదా అయింది.