Andhra Pradesh: చంద్రబాబుకు పనీపాటా లేదు.. ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు!: మంత్రి కొడాలి నాని
- నాణ్యమైన రేషన్ సరుకులు అందించబోతున్నాం
- రూ.700 విలువైన బియ్యాన్ని రూ.9ల సంచిలో అందిస్తున్నాం
- భారీగా ఖర్చు చేస్తున్నామన్న విమర్శలు సరికాదు
ఆంధ్రప్రదేశ్ లో నాణ్యమైన రేషన్ సరుకులను ప్రజలకు అందించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.11,000 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఈ సరుకులను నేరుగా ప్రజలకు చేరవేసేందుకు బ్యాగులు వాడుతున్నామనీ, వాటికి రూ.250 కోట్ల నుంచి 300 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకున్న అనంతరం నాని మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రేషన్ సరుకులను అందించేందుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ‘రూపాయి బియ్యానికి రూ.5 బ్యాగ్, సొల్లు కబుర్లు, సోది మాటలు మేం చెప్పబోం. ప్రతిపక్ష నేతలు ఏ విషయాన్నీ పరిశీలించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వీళ్లలో ఎవడికి వాడు మేమే పెద్ద మేధావి అనుకోవడం. మేం ఇచ్చే కేజీ బియ్యం మార్కెట్ లో రూ.35 అవుతుంది.
ఇదే 20 కేజీల బియ్యం ఇచ్చేందుకు రూ.700 అవుతుంది. ఈ బియ్యాన్ని మేం రూ.9 బ్యాగులో ఇస్తున్నాం. దీనికే నానా రాద్ధాంతం చేస్తున్నారు. ఏదైనా విషయంపై నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. ఇలాంటి ప్రచారాలను మాత్రం అంగీకరించబోం’ అని స్పష్టం చేశారు. గ్రామవాలంటీర్ల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతరులు చేస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ..‘ఆ.. చంద్రబాబు నాయుడు గారికి పనీపాటా లేదు. ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు’ అని విమర్శించారు.