Tiger: 23 ఏళ్ల ఉపాధ్యాయుడిని చంపి, తినేసిన పులి

  • మధ్యప్రదేశ్ లో మనోజ్ అనే ఉపాధ్యాయుడిని చంపిన పులి
  • ముఖం, కాళ్లు మినహా శరీరం మొత్తాన్ని తినేసిన వైనం
  • పులి ఆచూకీని కనిపెట్టే పనిలో అటవీ సిబ్బంది

మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మనోజ్ ధుర్వే అనే 23 ఏళ్ల ఉపాధ్యాయుడిని పులి చంపేసింది. అనంతరం అతన్ని పీక్కుతినేసింది. సియోని జిల్లాలో ఉన్న టైగర్ రిజర్వ్ కు సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

పెంచ్ టైగర్ రిజర్వ్ సమీపంలోని ముదియరీత్ గ్రామంలో మనోజ్ కు కొంత వ్యవసాయ భూమి ఉంది. అదే గ్రామంలో అతను ఓ ప్రాథమిక పాఠశాలలో విజిటింగ్ టీచర్ గా పని చేస్తున్నాడు. పుట్టగొడుగులను తీసుకురావడానికి మధ్యాహ్నం 11 గంటల సమయంలో సమీపంలోని అడవిలోకి అతను వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో... గ్రామస్తులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. రాత్రి 8.30 గంటల సమయంలో అడవిలో ఒక చోట అతని పాదరక్షలను గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి ఒక శరీరాన్ని లాక్కెళ్లిన్నట్టు గుర్తులు ఉండటంతో... వాటిని అనుసరిస్తూ వెళ్లి, మృతదేహాన్ని గుర్తించారు.

శరీరంలో చాలా భాగాన్ని పులి తినేసిందని... కేవలం ముఖం, కాళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. సమాచారాన్ని అటవీ అధికారులకు తెలియజేశామని చెప్పారు. ప్రస్తుతం పులి ఆచూకీని కనిపెట్టే పనిలో అటవీ సిబ్బంది ఉన్నారు. అయితే, భారీగా కురుస్తున్న వర్షాలు వారి ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయి.

టైగర్ రిజర్వ్ లో పులుల సంఖ్య భారీగా పెరిగిందని... చాలా పులులు సురక్షిత ప్రాంతం నుంచి బయటకు వచ్చాయని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇవి మనుషులు, పశువులపై దాడి చేస్తున్నాయని చెప్పారు. మరోవైపు, అటవీ అధికారులు మాట్లాడుతూ, పులిని పట్టుకుని, తిరిగి సురక్షిత ప్రాంతంలో వదిలిపెడతామని చెప్పారు. మృతుడి కుటుంబానికి ఆర్థికసాయాన్ని అందిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News