Andhra Pradesh: మెడికల్ కమిషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా ఆందోళన.. స్పందించిన డాక్టర్ సమరం!
- ఎంసీఐని రద్దుచేసిన కేంద్రం
- దాని స్థానంలో మెడికల్ కమిషన్ బిల్లు
- వైద్యులకు ప్రాతినిధ్యం ఉండదన్న డా.సమరం
భారత వైద్య మండలి స్థానంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు, జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగుతున్నారు. పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ప్రముఖ వైద్యుడు, సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం స్పందించారు.
‘ఇప్పటివరకూ దేశంలో ఎంసీఐ ఉండేది. కానీ ఏదో అవినీతి జరిగిపోతోందని దాని స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ను కేంద్రం ప్రారంభించింది. ఇదివరకూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) సభ్యులను డాక్టర్లు ఎన్నుకునేవారు. కానీ మెడికల్ కమిషన్ లో మాత్రం నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరు ఐఏఎస్ కావొచ్చు. ఇంకెవరైనా గవర్నమెంట్ నామినేటెడ్ సభ్యులు ఉండవచ్చు. దీనివల్ల వైద్యరంగంలో ఏ,బీ,సీ,డీలు తెలియనివాళ్లు డాక్టర్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చట్టం తీసుకురావడం నిజంగా అర్ధరహితం. కాబట్టి దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’ అని తెలిపారు.