Maharashtra: మహారాష్ట్రలో పడవ బోల్తా.. 14 మంది దుర్మరణం!
- సంగ్లీ జిల్లాలోని కృష్ణా నదిలో ఘటన
- వరద ప్రవాహానికి మరో ముగ్గురు గల్లంతు
- ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం ఫడ్నవీస్
మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కృష్ణా నదిలో వెళుతున్న ఓ పడవ వరద ప్రవాహానికి అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు. మిగిలినవారిని స్థానికులు, పడవలు నడిపేవారు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. భారీ వర్షాలతో మహారాష్ట్రలోని సంగ్లీ, కొల్హాపూర్ జిల్లాల్లో ప్రజాజీవనం స్తంభించిపోయింది.
వాగులు, వంకలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఈ రెండు జిల్లాల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సంగ్లీలో 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, కొల్హాపూర్ లో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. దాదాపు 1.30 లక్షల మంది ప్రజలను రెండు జిల్లాల యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించింది.