Andhra Pradesh: వైసీపీ వాళ్లు పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తే ఊరుకోం: చంద్రబాబు హెచ్చరిక
- బాబును కలిసిన కృష్ణా జిల్లా టీడీపీ సానుభూతిపరులు
- వైసీపీ దాడులపై ఫిర్యాదులు
- ఈ దాడులను ఖండించిన చంద్రబాబు
గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో తనను కలుసుకున్న పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ నేతలు తమపై దాడులకు పాల్పడ్డట్టు కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరులు ఆయనకు ఫిర్యాదు చేశారు. వైసీపీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి దాడులను సహించమని హెచ్చరించారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలోని భీమవరానికి చెందిన శ్రీహరి అనే అతను టీడీపీకి సహకరించాడని, అతని ఇల్లంతా ధ్వంసం చేశారని మండిపడ్డారు.
అతని కుటుంబానికి నిలువ నీడ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. శ్రీహరి కుటుంబానికి పార్టీ పరంగా రూ.50 వేలు ఆర్థికసాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన చాలా దారుణమని, తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై సీఎం, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరముందని, వైసీపీ వాళ్లు పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తే ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించారు. గుంటూరు జిల్లా పల్నాడులోని టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను వైసీపీ భయపెడుతుండటంతో వారు తమ గ్రామాలు విడిచి వెళ్లే పరిస్థితి వచ్చిందని నిన్న చంద్రబాబు పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు టీడీపీ నాయకులను పల్నాడు ప్రాంతానికి పంపిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.