Andhra Pradesh: జూడాలపై పోలీసులు చేయిచేసుకోవడాన్ని తప్పుబట్టిన ఏపీ హోం మంత్రి సుచరిత
- విజయవాడలో జూడాల నిరసన హింసాత్మకం
- ఘటనను ఖండించిన హోం మంత్రి
- విచారణకు ఆదేశించామంటూ వెల్లడి
కేంద్రం తీసుకువచ్చిన ఎన్ఎంసీ బిల్లు వైద్యరంగంలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. దీనిపై విజయవాడలో జూనియర్ వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించగా, పోలీసుల వైఖరి విమర్శలపాలైంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా పోలీసులదే తప్పంటూ ఒప్పుకోగా, రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా ఘటనపై తీవ్రంగా స్పందించారు. జూడాలపై పోలీసులు చేయిచేసుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ ఘటనను ఖండిస్తున్నామని, విచారణకు ఆదేశించామని వెల్లడించారు.
జూడాలు తమ హక్కుల కోసం ధర్నాలు చేసుకోవడంలో తప్పులేదని, కానీ శాంతియుతంగా చేపట్టే ధర్నాలు, ప్రదర్శనలకు మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని, ధర్నాలు, ఇతర ప్రదర్శనలో హింసకు పాల్పడడం సరికాదని అన్నారు.