Manipur: మణిపూర్ సీఎంను కదిలించిన చిన్నారి 'వృక్ష' విలాపం!
- ఇంటి వద్ద తాను నాటిన మొక్కలు పీకేశారంటూ బాలిక రోదన
- మణిపూర్ సీఎం దృష్టిలో పడిన వీడియో
- ఐదో తరగతికే అంబాసిడర్ హోదా దక్కించుకున్న చిన్నారి
మణిపూర్ రాష్ట్రంలోని ఓ చిన్నారి కన్నీటిపర్యంతమైన వైనం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను కదిలించివేసింది. కాక్సింగ్ జిల్లాకు చెందిన వాలెంటీనా ఎలాంగ్బన్ అనే చిన్నారి ఐదో తరగతి చదువుతోంది. నాలుగేళ్ల కిందట ఆ చిన్నారి తన ఇంటి ఎదుట రెండు మొక్కలు నాటగా, వీధి కాలువ నిర్మాణం సందర్భంగా ఆ మొక్కలను పీకేశారు. దాంతో ఆ బాలిక కన్నీళ్లు పెడుతూ తన బాధను మణిపూరీ భాషలో ఇతరులకు వివరించింది. ఈ సంఘటనను ఆమె బంధువొకరు వీడియో తీశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎంతో పాప్యులర్ అయింది.
ఆ వీడియో సీఎం బీరేన్ సింగ్ దృష్టిలో పడింది. చిన్న వయసులోనే వాలెంటీనా మొక్కల పట్ల కనబర్చిన ఆపేక్షను ఆయన అపురూపంగా భావించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ మిషన్ పర్యావరణ కార్యక్రమానికి ఆ బాలికను అంబాసిడర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయంతో ఆ బాలిక, ఆమె కుటుంబ సభ్యులు విస్మయానికి గురయ్యారు. అంతేకాదు, ఆమె ఏడ్చిన వీడియో కూడా వైరల్ అవుతోంది.