Andhra Pradesh: ఏపీ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది.. జగన్ ఉత్సాహంగా ఉన్నారు: ఏపీ గవర్నర్
- పోలవరం సహా పలు ప్రాజెక్టులు పూర్తికావాల్సి ఉంది
- మౌలిక సదుపాయాల కల్పన అవసరం
- ఏపీ ప్రజల ఆతిథ్యం బాగుంటుంది
ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, మున్ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ఉత్సాహంతో ఉన్నారని, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు తెలుసని అన్నారు. ఏపీ గవర్నర్ అయిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా తెలుగు, ఒడిశా ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఏపీలో ఉన్నా ఒడిశాలోనే ఉన్నట్టు అనిపిస్తోందని బిశ్వభూషణ్ అన్నారు. ఆంధ్రా ప్రజల ఆతిథ్యం గొప్పగా ఉంటుందని ప్రశంసించారు. కొత్త రాష్ట్రమైన ఏపీ రాజధాని నిర్మాణం చాలా ఏళ్లు పడుతుందని, పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉందని అన్నారు. అలాగే, మౌలిక సదుపాయాలు కూడా ఏర్పడాల్సి ఉందన్నారు.
ఆర్టికల్ 370 రద్దుపై గవర్నర్ మాట్లాడుతూ.. అద్భుతమైన, సాహసోపేతమైన నిర్ణయమని కొనియాడారు. ఇటీవల కన్నుమూసిన సుష్మాస్వరాజ్ తనకు చాలా బాగా తెలుసని, ఇద్దరం గతంలో జనతా పార్టీలో పనిచేశామని గవర్నర్ గుర్తు చేసుకున్నారు.