Bandar port: బందరు పోర్టు నిర్మాణ ఒప్పందాన్ని రద్దు చేసిన జగన్ సర్కారు
- నవయుగ సంస్థతో నిర్మాణ ఒప్పందం రద్దు
- డెవలపర్‌కు ఇచ్చిన 412.57 ఎకరాలు స్వాధీనం
- మళ్లీ మొదటికొచ్చిన పోర్టు వ్యవహారం
ఏపీలోని జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో బందరు పోర్టును నిర్మించాలని యోచిస్తున్న ప్రభుత్వం 2010 నాటి నిర్మాణ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ వెంటనే పోర్టు నిర్మాణం కోసం డెవలపర్‌కు ఇచ్చిన 412.57 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది.
23 ఏప్రిల్ 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బందరు పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు ఒప్పందం జరిగినా ఇప్పటి వరకు టెండర్ల దశలోనే ఉంది. దీంతో నవయుగ సంస్థతో కుదుర్చుకున్న నిర్మాణ ఒప్పందాన్ని తాజాగా ఏపీ ప్రభుత్వం రద్దు చేసుకుంది.
రూ.12 వేల కోట్ల వ్యయంతో బందరు పోర్టు నిర్మించాలని, 2025 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం గతంలో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 7న నిర్మాణ పనులను చంద్రబాబు ప్రారంభించి, మేకవారిపాలెంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఇప్పుడీ నిర్మాణ పనులను ప్రభుత్వం రద్దు చేయడంతో బందరు పోర్టు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.