Dhoni: లడఖ్ లోని లేహ్ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్న ధోనీ
- ప్యారాచూట్ విభాగంలో గౌరవ లెఫ్టినెంట్ గా ఉన్న ధోనీ
- స్వాతంత్ర్య దినోత్సవం నాడు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయనున్న ధోనీ
- ఆగస్ట్ 15 వరకు సైనిక విధుల్లోనే
జమ్ముకశ్మీర్ కు ఇప్పటి వరకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మోదీ సర్కారు విడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ లడఖ్ లోని లేహ్ లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. భారత సైన్యంలోని ప్యారాచూట్ విభాగంలో ధోనీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. తన బృందంతో కలసి రేపు లేహ్ కు ధోనీ వెళ్లనున్నారని ఓ సైనికాధికారి తెలిపారు.
ఈ సందర్భంగా సదరు సైనికాధికారి మాట్లాడుతూ, భారత సైన్యానికి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు. ప్రస్తుతం అతను విధులను నిర్వహిస్తున్న చోట తన బృంద సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పారు. సైనిక బలగాలతో కలసి విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఆగస్టు 15 వరకు ధోనీ తన విధుల్లో ఉంటారని చెప్పారు.