Nara Lokesh: ఎంపీ గోరంట్ల మాధవ్ సారీ చెప్పాలి: స్పెషల్ హ్యాష్ ట్యాగ్ తో నారా లోకేశ్ ఫైర్
- కియా ప్రతినిధిపై వైసీపీ ఎంపీ మాధవ్ ఆగ్రహం
- పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైన వైనం
- తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్
ఎంతో ప్రతిష్ఠాత్మక రీతిలో ఏపీలో పరిశ్రమ పెట్టిన కియా మోటార్స్ ప్రతినిధులకు తమ కారు మార్కెట్లోకి వచ్చిన తొలి రోజే అనూహ్య పరిణామం ఎదురుకావడం తెలిసిందే. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ కియా ప్రతినిధిని వేలు చూపించి మరీ బెదిరించడం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.
మీ దౌర్జన్యాలకు కియా ప్రతినిధులు బెదిరిపోయి ఢిల్లీ వెళ్లి మోదీకి ఫిర్యాదు చేస్తే, మీరు సంజాయిషీ ఇచ్చుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరించారు. మీ తండ్రి గారికి ఇచ్చిన మాట కోసం కియా వాళ్లు అనంతపురంలో ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు చెప్పుకుంటున్న జగన్ గారూ, ఈ దాడులేంటండీ అంటూ లోకేశ్ నిలదీశారు.
అయినా, కియా మోటార్స్ వంటి అంతర్జాతీయ సంస్థనే ఈ స్థాయిలో బెదిరిస్తున్నారంటే, లోకల్ పెట్టుబడిదారులను మీ జె ట్యాక్స్ తో ఇంకెంత హడలెత్తిస్తున్నారో అర్థమవుతోంది అని మండిపడ్డారు. మీకే చేతనయితే నాలుగు సంస్థలను రాష్ట్రానికి తీసుకురండి, అంతేగానీ, మా కష్టంతో వచ్చిన కంపెనీలను మీ పులివెందుల పంచాయతీలతో బెదిరించి తరిమేయకండి అంటూ హితవు పలికారు. అంతేకాదు, "సారీ కియా" అంటూ ఓ ట్వీట్ కు హ్యాష్ ట్యాగ్ పెట్టిన లోకేశ్, "మాధవ్ సారీ చెప్పాలి" అంటూ మరో హ్యాష్ ట్యాగ్ సంధించాడు.