Chandrababu: పేదలంటే సీఎం జగన్ కు ఎందుకంత కోపం?: చంద్రబాబునాయుడు
- 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదు
- మా హయాంలో కచ్చితంగా పింఛన్ ఇచ్చే వాళ్లం
- పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మూసేశారు!
అమరావతిలో టీడీపీ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తమ హయాంలో గిరిజనులకు ప్రత్యేక పంచాయతీల ఏర్పాటుకు నాంది పలికామని, కరవు జిల్లా అనంతపురానికి కియా పరిశ్రమను తీసుకొచ్చామని, సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడా వివక్ష చూపలేదని అన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. నలభై ఐదు ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని, మాట తప్పిందని మండిపడ్డారు. తమ హయాంలో ఒకటో తేదీన కచ్చితంగా పింఛన్ ఇచ్చే వాళ్లమని, ప్రస్తుతం పింఛన్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి అని విమర్శించారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మూసేశారని, పేదలంటే సీఎం జగన్ కు ఎందుకంత కోపం? రూ.5 కే పేదలు అన్నం తింటుంటే ఏమిటీ కక్ష సాధింపు? అని ప్రశ్నించారు. ఇసుకను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు.
వైసీపీ రౌడీలు కియా పరిశ్రమ వద్ద వీరంగం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నలభై ఏళ్లలో తనకు తృప్తిని ఇచ్చిన అంశం గత ఐదేళ్లలో ఏపీలో చేసిన అభివృద్ధే అని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి , బందరు పోర్టు పనులు నిలుపుదల చేశారని మండిపడ్డారు. రద్దుల ప్రభుత్వంలా వైసీపీ సర్కారు తయారైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.