Pakistan: గంపెడాశతో చైనా వద్దకు వెళ్లిన పాకిస్థాన్ కు దిమ్మదిరిగిపోయింది!
- ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై స్పందించాలంటూ చైనాకు పాక్ విజ్ఞప్తి
- అది తమ పని కాదని తేల్చిచెప్పిన చైనా
- శాంతియుతంగా పరిష్కరించుకోవాలంటూ సలహా
చైనాను గుడ్డిగా నమ్మే పాకిస్థాన్ కు డ్రాగన్ వైఖరి క్రమంగా బోధపడుతోంది. జమ్మూకశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోవాల్సిందిగా పాకిస్థాన్ కోరగా, అది తమ పని కాదని చైనా స్పష్టం చేసింది. భారత్ తీసుకున్న నిర్ణయంపై తమకు అనుకూలంగా స్పందించాలంటూ చైనా అధినాయకత్వానికి పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆయన హడావుడిగా బీజింగ్ వెళ్లి చైనా విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. భారత్ నిర్ణయంపై సత్వరమే స్పందించాలని కోరారు.
దీనికి చైనా స్పందించిన తీరు పాక్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మాత్రమే తాము సూచించగలమని, దక్షిణాసియాలో సామరస్యపూర్వక ధోరణితో వ్యవహరించాలన్నంత వరకే తాము చెప్పగలమని చైనా తేల్చి చెప్పింది. భారత్ కు వ్యతిరేకంగా తమతో కలిసొస్తుందని భావించిన పాకిస్థాన్.. చైనా సమాధానంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
ఇప్పటికే ఐక్యరాజ్యసమితి కూడా మధ్యవర్తిత్వానికి విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన ఏకైక ఆశాకిరణం చైనా కూడా మొండిచేయి చూపడంతో పాక్ ఆశలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని చెప్పాలి.