Pakistan: ఢిల్లీ-లాహోర్ బస్సు సర్వీసులను కూడా నిలిపివేసిన పాక్!
- భారత్‌తో సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్న పాక్
- మొన్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్
- పాక్‌లో రోజురోజుకు పెరుగుతున్న అసహనం
జమ్ముకశ్మీర్‌కు ఇప్పటి వరకు ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత గుర్రుగా ఉన్న పాకిస్థాన్.. భారత్‌తో సంబంధాలను తెంచుకుంటూ పోతోంది. తొలుత ద్వైపాక్షిక సంబంధాలను, ఆ తర్వాత వాణిజ్యాన్ని తెగదెంపులు చేసుకుంది. అటు తర్వాత సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను నిలిపివేసింది. ఆ తర్వాత థార్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను రద్దు చేసింది. తాజాగా, ఢిల్లీ-లాహోర్ మధ్య నడిచే బస్సు సేవలను కూడా నిలిపివేసింది. ఈ మేరకు పాక్ మంత్రి మురాద్ సయీద్ పేర్కొన్నారు.
ఢిల్లీ గేట్ సమీపంలోని అంబేద్కర్ స్టేడియం బస్ టెర్మినల్ నుంచి ప్రతీ సోమ, బుధ, శుక్రవారాల్లో లాహోర్‌కు ఈ బస్సులు బయలుదేరుతాయి. అదే సమయంలో పాకిస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (పీటీడీసీ) మంగళ, గురు, శనివారాల్లో ఢిల్లీకి బస్సులు నడుపుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది.
భారతదేశం యుద్ధం లాంటి పరిస్థితిని సృష్టిస్తోందని ఆరోపించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అంతర్జాతీయంగా ఎటువంటి మద్దతు కూడగట్టుకోలేకపోయారు. కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం విషయంలో తాము జోక్యం చేసుకోలేమని అంతర్జాతీయ సమాజం పాక్ ముఖం మీదే చెప్పేసిన తర్వాత ఇమ్రాన్‌లో అసహనం రోజురోజుకు మరింత పెరుగుతోంది. దీంతో భారత్-పాక్ మధ్య ఉన్న సంబంధాలను తెంచుకునే పనిలో ఇమ్రాన్ పడ్డారు.