bay of bengal: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం...12 నాటికి ఏర్పడే అవకాశం
- ఇప్పటికే వానలు, వరదలతో సతమతం
- పొంగి ప్రవహిస్తున్న కృష్ణ, గోదావరి నదులు
- గోదావరి జిల్లాల రైతుల్లో ఆందోళన
బంగాళాఖాతంలో ఈ నెల 12వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన వాతావరణం ఉన్నట్లు తెలిపింది. ఇటీవల దాదాపు ఈ ప్రాంతంలోనే అల్పపీడనం ఏర్పడి, అనంతరం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తున్న కృష్ణ, గోదావరి, వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా పిలిచే గోదావరి జిల్లాలు వరదలో చిక్కుకుని విలవిల్లాడాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడుతోందన్న వార్తలు బాధిత ప్రాంతాల వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి.