Kerala: వరుణుడి విలయతాండవంతో అందాల కేరళ కకావికలం
- కొనసాగుతున్న కుంభవృష్టి
- వర్షాలు, వరదల కారణంగా 32 మంది మృతి
- విరిగి పడుతున్న కొండచరియలు
ప్రకృతి విలయతాండవంతో అందాల కేరళ రాష్ట్రం కకావికలమైంది. వరుణుడి బీభత్సం, వరద ఉగ్రరూపంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రకృతి అందాలకు నెలవైన కేరళ రాష్ట్రం గత ఏడాది ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. క్రమేపీ కోలుకుంటున్న దశలో మళ్లీ ప్రకృతి పడగ విసిరింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి ఆ రాష్ట్రం వణికిపోతోంది. అక్కడక్కడా కొండచరియలు విరిగి పడుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. భారీ వర్షాలు, వరదల ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య ఈ రోజుకి 42కు చేరింది. ఉత్తర కేరళలోని వయనాడ్, మలప్పురంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. వయనాడ్‌లో కొన్ని చోట్ల 24 గంటల్లో 40 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. వయనాడ్‌లో మాదిరిగానే మలప్పురం జిల్లాలో కూడా శుక్రవారం సాయంత్రం కొంచ చరియలు విరిగిపడ్డాయి శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను బయటకు తీసినట్లు తెలిపారు. మరిన్ని కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో అక్కడ సహాయక చర్యలను నిలిపివేశారు.