Gavaskar: టీమిండియాలో అసూయాపరుడు ఉన్నాడు... కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాల సృష్టి అతడి పనే అయ్యుండొచ్చు: గవాస్కర్
- కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలంటూ మీడియాలో కథనాలు
- ఈ పుకార్ల వెనుక జట్టులోని ఆటగాడి హస్తం ఉండొచ్చంటూ గవాస్కర్ సందేహం
- అప్పట్లో కపిల్ ఉద్వాసనకు తానే కారణమన్నారని వెల్లడి
వరల్డ్ కప్ లో ఓటమి కంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయనే అంశమే ఎక్కువగా చర్చకు వస్తోంది. ఈ క్రమంలో దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు ఉన్నాయంటూ వస్తున్న కథనాల వెనుక ఎవరైనా అసూయాపరుడైన ఆటగాడి హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. జట్టులో ఉన్న ఆ అసూయాపరుడు ఆటగాళ్ల మధ్య చిచ్చుకు కారణమవుతున్నాడని పేర్కొన్నారు. తరచుగా విఫలమయ్యే ఆ ఆటగాడే లేనిపోని పుకార్లు పుట్టిస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు.
గతంలో తనకు, కపిల్ దేవ్ కు మధ్య విభేదాలున్నాయంటూ ప్రచారం జరిగిందని, ఇప్పటికీ చాలామందిలో అదే అభిప్రాయం ఉందని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. 80వ దశకంలో ఓసారి కపిల్ ను జట్టు నుంచి తప్పించినప్పుడు అందుకు గవాస్కరే కారణమంటూ కథనాలు వచ్చాయని, వాస్తవానికి ఆ నిర్ణయాన్ని అప్పటి సెలక్టర్ హనుమంత్ సింగ్ తీసుకున్నాడని వెల్లడించారు. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు ఉన్నట్టు పుకార్లు వస్తుండడం చూస్తుంటే ఆనాటి కపిల్ దేవ్ వ్యవహారమే జ్ఞప్తికి వస్తోందని అన్నారు.