India: ఆలస్యం కానున్న టీమిండియా కోచ్ ఎంపిక
- ఆగస్టు 15 తర్వాత ఇంటర్వ్యూలు
- ఇంటర్వ్యూ దశకు ఆరుగురు అభ్యర్థులు
- ఒకేరోజున అందరికీ ఇంటర్వ్యూలు
టీమిండియా ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియ ఆలస్యం కానుంది. వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా, కపిల్ దేవ్ కమిటీ సభ్యులు ఆరుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూ దశకు ఎంపిక చేశారు. వీరికి ఆగస్టు 15 తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీరందరినీ ఒకేరోజు ఇంటర్వ్యూ చేయాలని కపిల్ కమిటీ నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 13, 14 వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించాలని తొలుత భావించారు. అయితే, కొన్ని పత్రాల పరిశీలనకు సమయం పడుతుండడంతో ఇంటర్వ్యూలను వాయిదా వేశారు.
ఏదేమైనా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభీష్టం మేరకు కోచ్ నియామకం ఉంటుందా? లేదా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. రవిశాస్త్రిని కొనసాగిస్తే తమకు సంతోషం అని కోహ్లీ ఇప్పటికే బహిరంగంగా తన అభిప్రాయం వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కోచ్ ఎంపికలో తాము కెప్టెన్ అభిప్రాయం తీసుకోబోవడం లేదని కపిల్ కమిటీ స్పష్టం చేసింది.