Vaikuntam: వైకుంఠం నిండిపోయి లేపాక్షి వరకూ క్యూ లైన్... తిరుమలలో భక్తుల తీవ్ర ఇబ్బందులు!
- వరుస సెలవులతో వెల్లువలా భక్తులు
- దర్శనానికి 26 గంటల సమయం
- పవిత్రోత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు
వరుస సెలవులు రావడంతో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసి పోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్ లోని 32 కంపార్టుమెంట్లూ నిండి, ఆపై నారాయణగిరి ఉద్యానవనంలోని తాత్కాలిక షెడ్ల మీదుగా, లేపాక్షి జంక్షన్ వరకూ క్యూలైన్ పెరిగిపోయింది. ఇప్పుడు వచ్చే భక్తులకు 26 గంటల తరువాత మాత్రమే దర్శనం జరుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి.
శని, ఆదివారాలకు తోడు, సోమవారం నాడు కూడా సెలవు రావడంతోనే రద్దీ విపరీతంగా పెరిగిందని, క్యూలైన్లలో ఉన్న వారి కోసం అన్న పానీయాలను నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. శనివారం నాడు స్వామివారిని 90 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.
కొండపైకి వచ్చిన భక్తులకు గదులు లభించే పరిస్థితి లేదు. దీంతో తాత్కాలిక షెడ్లల్లోనే వేలాది మంది విశ్రాంతి తీసుకుంటూ అవస్థలు పడుతున్నారు. మరోవైపు స్వామివారి పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.