New Parliament: భారత్ కు కొత్త పార్లమెంట్ భవనం: స్పీకర్ ఓమ్ బిర్లా
- కొత్త భవంతిపై అన్ని వర్గాల అభిప్రాయాలూ తీసుకుంటున్నాం
- ఆశాజనకంగా పనిచేసిన లోక్ సభ
- త్వరలోనే అన్ని రాష్ట్రాల స్పీకర్లతో సమావేశం
ఇండియాకు కొత్త పార్లమెంట్ భవంతిని నిర్మించే ఆలోచనను పరిశీలిస్తున్నట్టు లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కొత్త భవంతి ఉండాలన్న ఆలోచన మాత్రం ఉందని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, నూతన పార్లమెంట్ నిర్మాణానికి అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఇప్పుడున్న భవంతిని ఆధునికీకరించాలని కూడా భావిస్తున్నామని తెలిపారు. భారతావనికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు గడిచి, వేడుకలు జరుపుకుంటున్న వేళ, నవీన భారతావని కోసం కొత్త పార్లమెంట్ కావాలని ఆయన అన్నారు.
దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియా ఉందని ఆయన గుర్తు చేశారు. గడచిన లోక్ సభ సమావేశాలు ముందుగా అనుకున్న సమయం కన్నా 72 గంటలు అధికంగా పని చేశాయని ఓమ్ బిర్లా తెలిపారు. సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించారని, విపక్షాలకు కృతజ్ఞతలని అన్నారు. లోక్ సభ సజావుగా సాగితే, దేశ ప్రజలకు ఓ పాజిటివ్ మెసేజ్ వెళుతుందని, వివిధ బిల్లుల ఆమోదం విషయంలో గత సీజన్ ఆశాజనకంగా పని చేసిందని అన్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ సక్రమంగా అమలు చేయాలని సూచించారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో త్వరలోనే సమావేశం కానున్నట్టు వెల్లడించారు.