kapu: కాపులను టీడీపీ ఓటు బ్యాంకుగానే భావించింది : మంత్రి బొత్స విమర్శ
- గత ఎన్నికల ముందు వాడుకుని అధికారంలోకి వచ్చాక వదిలేసింది
- రిజర్వేషన్లపై కేంద్రం స్పష్టంగా చెప్పినా మోసం చేసింది
- కాపుల సంక్షేమాన్ని కోరే వ్యక్తి సీఎం జగన్
రాష్ట్రంలో కాపులను ఓటు బ్యాంకుగా పరిగణించే తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో ఆ విధంగానే పరిగణించిందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక కాపులను పట్టించకోవడం మానేసిందన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్గా జక్కంపూడి రాజా బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరైన మంత్రి బొత్స మాట్లాడారు.
కాపులకు రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలపై కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించినా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు మోసం చేస్తూనే వచ్చిందన్నారు. కాపు సంక్షేమానికి గత ప్రభుత్వం తూట్లు పొడిస్తే వారి సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారికి అండగా నిలుస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అందువల్ల కాపులం అంతా ఆయన వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా, విద్యాపరంగా కాపులు అభ్యున్నతి సాధించాలని సూచించారు.