Andhra Pradesh: కాపులంతా వైఎస్ జగన్ వెంట ఉన్నారు: జక్కంపూడి రాజా
- అర్హులైన ప్రతి ఒక్కరికీ కాపు కార్పొరేషన్ నిధులు
- ఆర్థికంగా, విద్యాపరంగా కాపులను అభివృద్ధి చేస్తాం
- కాపుల సంక్షేమానికి గత ప్రభుత్వం చేసిందేమీ లేదు
కాపుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తున్న వైఎస్ జగన్ వెంటే వారు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ కాపు కార్పొరేషన్ నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. ఆర్థికంగా, విద్యాపరంగా కాపులను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
కాపుల సంక్షేమానికి గత ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.
కాపులను చంద్రబాబు మోసం చేశారు: మంత్రి కన్నబాబు
సీఎం వైఎస్ జగన్ మాటిస్తే తప్పరని మంత్రి కన్నబాబు అన్నారు. చేయగలిగిందే చేస్తానని చెప్పే వ్యక్తి జగన్ అని కొనియాడారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అంటూ బాబు మోసం చేశారని, మాట్లాడితే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. కాపులకు ఏం చేశారని ప్రశ్నించారు. కాపులకు ఇచ్చిన హామీలను తూ.చ.తప్పకుండా జగన్ పాటిస్తున్నారని, ఐక్యంగా ఉంటే అన్నీ సాధించుకోగలుగుతామని చెప్పారు.
కాపులను టీడీపీ వాడుకుని వదిలేసింది: మంత్రి బొత్స
కాపులను టీడీపీ వాడుకుని వదిలేసిందని, కాపుల సంక్షేమానికి చంద్రబాబు తూట్లు పొడిచారని విమర్శించారు. కాపుల సంక్షేమంలో రాజీపడే ప్రసక్తే లేదని, పదమూడు జిల్లాల్లో కాపుల స్థితిగతులపై అధ్యయనం చేయాలని, కాపులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతిఒక్కరికీ నిధులు అందుతాయి: పేర్ని నాని
కాపు సామాజికవర్గమంతా ఆరాధించే నాయకుడు సీఎం జగన్ అని, కాపు విద్యార్థులకు కార్పొరేషన్ అండగా ఉంటుందని, అర్హులైన ప్రతిఒక్కరికీ నిధులు అందుతాయని మంత్రి పేర్ని నాని చెప్పారు.
గతంలో కాపు కార్పొరేషన్ నిధులు టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి: ఆళ్ల నాని
కాపులు చంద్రబాబును ఎప్పటికీ నమ్మరని, కాపుల సంక్షేమం గురించి చంద్రబాబు తన హయాంలో ఏనాడైనా ప్రధాని మోదీతో మాట్లాడారా? అని మంత్రి ఆళ్ల నాని ప్రశ్నించారు. గతంలో కాపు కార్పొరేషన్ నిధులు టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. కాపులకు ఇచ్చిన మాటను బాధ్యతగా చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.