Virat Kohli: సెంచరీతో పరుగుల కరవు తీర్చుకున్న విరాట్ కోహ్లీ
- విండీస్ తో రెండో వన్డేలో కోహ్లీ శతకం
- టీమిండియా 39 ఓవర్లలో 3 వికెట్లకు 203 పరుగులు
- రాణించిన శ్రేయాస్ అయ్యర్
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత మూడంకెల స్కోరు సాధించాడు. ఇటీవల వరల్డ్ కప్ లో ఆశించిన మేర రాణించలేకపోయిన కోహ్లీ తాజాగా వెస్టిండీస్ టూర్ లో బ్యాట్ ఝుళిపించాడు. విండీస్ తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో కోహ్లీ (107) సెంచరీ సాధించి తన పరుగుల దాహం తీరనిదని నిరూపించాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్లు శిఖర్ ధావన్ (2), రోహిత్ శర్మ (18) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.
పంత్ కూడా 20 పరుగులు చేసి అవుట్ కాగా, శ్రేయాస్ అయ్యర్ తో కలిసి కోహ్లీ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 112 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. కోహ్లీ వన్డే కెరీర్ లో ఇది 42వ శతకం. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ (47) కూడా ఫిఫ్టీ వైపు అడుగులేస్తున్నాడు. ఈ క్రమంలో టీమిండియా 39 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.