Hyderabad: తన కార్యాలయ ఉద్యోగిని కర్రతో చితకబాదిన కార్వాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ఓ గురువులా మందలించానని కౌసర్ వివరణ
- దురలవాట్లు మానుకోమని చెప్పారన్న ఉద్యోగి
తన సొంత కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై హైదరాబాద్, కార్వాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ చెలరేగిపోయారు. కర్రతో ఆయనను చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను కొట్టొద్దని ఉద్యోగి సర్వర్ బతిమాలుతున్నా వినిపించుకోని కౌసర్.. కాళ్లకు దండం పెట్టించుకుని మరీ కొడుతుండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
వీడియో బయటకు రావడంతో కౌసర్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన స్పందించారు. దురలవాట్లకు బానిసైన సర్వర్‌ను అవి మానుకోవాలని ఓ ఉపాధ్యాయుడు చెప్పినట్టు చెప్పాను తప్పితే, తాను ఎటువంటి తప్పు చేయలేదని కౌసర్ పేర్కొన్నారు.
మరోవైపు సర్వర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. తనకు దురలవాట్లు ఉన్నాయని, వాటిని మానుకోమని ఎమ్మెల్యే చాలాసార్లు చెప్పారని పేర్కొన్నాడు. మద్యం మత్తులో ఎవరితోనూ గొడవ పడొద్దని చెప్పారని అన్నాడు. తనను మందలించారు తప్పితే, గాయపరిచే ఉద్దేశం ఆయనకు లేదని చెప్పుకొచ్చాడు. గత పదేళ్లుగా కౌసర్ వద్దే పనిచేస్తున్నానని, ఎప్పటికీ ఆయన వద్దే పనిచేస్తానని పేర్కొన్నాడు.