america: పెన్సిల్వేనియా డే కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం.. ఐదుగురు చిన్నారుల సజీవ దహనం
- లివింగ్ రూములో ఎగసిపడిన మంటలు
- ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత
- ఏడుగురు చిన్నారులను రక్షించిన పోలీసులు
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో పెను విషాదం జరిగింది. ఓ డే కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు పిల్లల్ని రక్షించారు. ఎరీ నగరంలోని హ్యారిస్ ఫ్యామిలీ పిల్లల సంరక్షణ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
మృతి చెందిన చిన్నారుల్లో 8 నెలల వయసు నుంచి ఏడేళ్ల వయసున్న చిన్నారులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సంరక్షణ కేంద్రం యజమాని సహా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్టు పేర్కొన్నారు. కాగా, మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.
డే కేర్లోని మొదటి అంతస్తులో ఉన్న లివింగ్ రూములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. రక్షణకు సంబంధించిన అన్ని ప్రమాణాలు తీసుకున్నప్పటికీ ఈ దుర్ఘటన జరిగినట్టు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.