Hyderabad: సినిమా పేరిట మోసం... సిరిమల్లె ప్రొడక్షన్స్ యజమాని అరెస్ట్!
- కార్పొరేట్ స్థాయిలో ఆఫీస్
- అనుబంధంగా యానిమేటెడ్ సంస్థ
- రూ. 80 లక్షలిచ్చి మోసపోయిన వ్యక్తి
తాను సినిమాలు నిర్మిస్తున్నానని, యానిమేషన్ సినిమాలు కూడా తీస్తున్నానని, కార్పొరేట్ స్థాయిలో ఖరీదైన కార్యాలయం ఏర్పాటు చేసి, డబ్బు దోచిన వ్యక్తిని హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, బౌరంపేటకు చెందిన వెంకటేశ్వర్లు అలియాస్ సిరిమల్లె వెంకటేశ్వర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నష్టపోయాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 71లో సరిమల్లె ప్రొడక్షన్స్ పేరిట కార్పొరేట్ ఆఫీస్ తెరిచాడు. దానికి అనుబంధంగా అవికాన్ స్టూడియో పేరిట యానిమేషన్ సంస్థ ఏర్పాటు చేశాడు. పెద్దఎత్తున సినిమాలు తీయనున్నానని నమ్మించాడు.
దుండిగల్ కు చెందిన జీ పాండురంగనాథ్ తో పరిచయం ఏర్పడగా, పెట్టుబడి పెడితే, రెట్టింపు లాభాలు ఇస్తానని నమ్మించాడు. దీంతో పాండురంగనాథ్ రూ. 80 లక్షలు ఇచ్చాడు. ఆపై నెలలు గడిచినా సినిమా తీయలేదు. అడిగితే సరైన ప్రాజెక్ట్ రావడం లేదని కాలం గడిపాడు. డబ్బు తిరిగి ఇచ్చేయాలని పాండురంగనాథ్ డిమాండ్ చేయగా, ఎదురు తిరిగి చంపేస్తానని బెదిరించాడు. దీంతో పాండురంగనాథ్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. అతనిపై గతంలో గోపాలపురం, నారాయణగూడ పోలీసు స్టేషన్ల పరిధిలో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.