Nagarjuna Sagar: సాగర్ డ్యామ్... మరో రెండు గేట్ల ఎత్తివేత... నిండిపోయిన పులిచింతల... ప్రకాశం బ్యారేజ్ వద్ద అప్రమత్తం!
- నిండిపోయిన సాగర్ టెయిల్ పాండ్
- రాత్రికి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తే అవకాశం
- ఘాట్ల వద్ద అధికారుల నిషేధాజ్ఞలు
ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహం మరింతగా పెరగడంతో, ఈ ఉదయం నాగార్జున సాగర్ డ్యామ్ 4 క్రస్ట్ గేట్లను ఎత్తిన అధికారులు, మరో రెండు గేట్లను కొద్దిసేపటి క్రితం తెరిచారు. దీంతో టెయిల్ పాండ్ పై నుంచి నీటి ప్రవాహం ప్రారంభమైంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు మరో గంట వ్యవధిలోనే నిండుతుందని అంచనా. ఆపై పులిచింతల గేట్లు తెరిస్తే, సాయంత్రానికి తరువాత నీరు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు చేరనుంది.
దీంతో అప్రమత్తమైన అధికారులు, పలు ఘాట్ల వద్ద నిషేధాజ్ఞలు విధిస్తూ, నదిలో నిర్మించిన బారికేడ్లను ముందుకు జరుపుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ సాయంత్రం, లేదా రాత్రికి నీటిని సముద్రంలోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఎగువ నుంచి వచ్చే నీటిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, నిమిషాల్లో నీరు ఉద్ధృతంగా ఘాట్లలోకి వచ్చేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను, మరపడవలను సిద్ధం చేస్తున్నామని అన్నారు.