Andhra Pradesh: అయ్యా జగన్ గారూ.. ‘మీసేవ’ను రద్దు చేస్తున్నారట.. నిజమేనా?: టీడీపీ నేత వర్ల రామయ్య
- ఇలాంటి విపరీత నిర్ణయాలు ఎందుకు?
- మీ పాలన రద్దుల పాలనగా మారింది
- గ్రామ వాలంటీర్లే అన్నీ చేస్తారని చెప్పడం మోసగించడమే
ఏపీ ప్రభుత్వం ‘మీ సేవ’ను రద్దుచేయబోతోందని కొన్ని మీడియా సంస్థల్లో ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. ‘మీ సేవ’ రద్దు చేస్తున్నారని వస్తున్న వార్తలు నిజమో, కాదో ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని వర్ల రామయ్య కోరారు. అసలు ఇలాంటి విపరీతమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.
జగన్ 73 రోజుల పరిపాలన ‘రద్దుల పాలన’గా పేరు గాంచిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే ‘మీ సేవ’ను రద్దు చేయవద్దని వర్ల రామయ్య కోరారు. ప్రతీ పనిని గ్రామ వాలంటీర్లే చూసుకుంటారని చెప్పడం ప్రజలను మోసగించడమే అవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు వర్ల రామయ్య ట్వీట్ చేశారు.