Kotamreddy: కస్తూరిదేవి స్కూల్ విషయంలో మాట్లాడదాం రమ్మని పిలిస్తేనే డోలేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లాను: కోటంరెడ్డి వివరణ
- పాత్రికేయుడిపై వైసీపీ ఎమ్మెల్యే దాడి అంటూ మీడియాలో కథనాలు
- తన తప్పేం లేదంటున్న కోటంరెడ్డి
- తన తప్పు ఉంటే పోలీసులకు లొంగిపోతానని వెల్లడి
జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ పై తాను చేయిచేసుకున్నట్టు వస్తున్న కథనాలు వాస్తవం కాదని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నారు. ఈ మేరకు ఆయన వివాదంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కస్తూరి దేవి స్కూల్ విషయంలో మాట్లాడుకుందాం రమ్మంటేనే తాను డోలేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లానని, డోలేంద్ర ప్రసాద్ కావాలనే తనపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని కోటంరెడ్డి ఆరోపించారు. తన తప్పు ఉంటే మాత్రం పోలీసులకు లొంగిపోతానని అన్నారు.
కాగా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్యం తాగి డోలేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లడమే కాకుండా, ఆయనను తీవ్రంగా దుర్భాషలాడి దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై డోలేంద్ర ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం ఆరుగురిపై కేసు నమోదైంది. పాత్రికేయుడిపై వైసీపీ ఎమ్మెల్యే దాడి అంటూ మీడియా సంఘాలు, విపక్షాలు మండిపడ్డాయి.