Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఘాటు కౌంటర్.. విమానం పంపిస్తా.. రమ్మన్న కశ్మీర్ గవర్నర్
- జమ్ము,కశ్మీర్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న రాహుల్
- బాధ్యత కలిగిన వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదన్న గవర్నర్
- కాంగ్రెస్ నేతల మాటలకు రాహుల్ సిగ్గుపడాలన్న సత్యపాల్ మాలిక్
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము,కశ్మీర్లో హింస చెలరేగుతోందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ కోసం ప్రత్యేకంగా ఓ విమానం పంపుతానని, వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి చూసుకోవచ్చని పేర్కొన్నారు. రాహుల్‌ను బాధ్యత కలిగిన నాయకుడిగా అభివర్ణించిన సత్యపాల్ మాలిక్.. ఆయన ఇలాంటి బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
పార్లమెంటులో ‘ఇడియట్’లలా మాట్లాడిన సొంత పార్టీ నేతలను చూసి రాహుల్ సిగ్గుపడాలన్నారు. ‘‘రాహుల్‌ను కశ్మీర్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ఆయన కోసం నేనో విమానాన్ని పంపిస్తా. ఇక్కడ పర్యటించి ఆ తర్వాత మాట్లాడాలి. మీరో బాధ్యతాయుతమైన నేత అయి ఉండీ ఇలా బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు చేయడం సరికాదు’’ అని మాలిక్ పేర్కొన్నారు. శనివారం రాత్రి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జమ్ము,కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయమై దృష్టిసారించాలని కోరారు. ఆయన వ్యాఖ్యలకు ప్రతిగా గవర్నర్ ఇలా స్పందించారు.