Jammu And Kashmir: జమ్ము, కశ్మీర్ అంశంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- జమ్ము, కశ్మీర్ లోని పరిస్థితులు చాలా సున్నితమైనవి
- కేంద్ర ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలి
- ఇప్పటికిప్పుడు కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం
జమ్ము, కశ్మీర్ లోని పరిస్థితులు చాలా సున్నితమైనవని... అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము,కశ్మీర్ లో పలు ఆంక్షలను విధించారని... వెంటనే వాటిని ఎత్తివేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. ఇప్పటికిప్పుడు కేంద్రానికి తాము ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేమని స్పష్టం చేసింది. జమ్ము,కశ్మీర్ లో ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని... అక్కడి పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత ఈ పిటిషన్ ను విచారిస్తామని తెలిపింది.
జమ్ము, కశ్మీర్ లో పరిస్థితులను రోజువారీగా గమనిస్తున్నామని... జిల్లా కలెక్టర్ల నివేదికల ఆధారంగా ఆంక్షలను సడలిస్తున్నామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. 2016లో టెర్రరిస్ట్ బుర్హన్ వనీని ఎన్ కౌంటర్ చేసినప్పుడు కశ్మీర్ లో పరిస్థితి అదుపు తప్పిందని... సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మూడు నెలల సమయం పట్టిందని గుర్తు చేశారు.
1990 నుంచి జమ్ము, కశ్మీర్ లో 44 వేల మంది ప్రాణాలు కోల్పోయారని వేణుగోపాల్ తెలిపారు. జమ్ము, కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని అన్నారు. జమ్ము, కశ్మీర్ లో ఏదైనా ఊహించరానిది జరిగితే, దానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. అందరూ కేంద్ర ప్రభుత్వాన్నే నిందిస్తారని అన్నారు. ఆంక్షలు విధించిన తర్వాత గత సోమవారం నుంచి ఒక మరణవార్త కూడా వినిపించలేదని చెప్పారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందని... సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు.