Telugudesam: చంద్రబాబు సమక్షంలో నిర్మొహమాటంగా అభిప్రాయాలు వెల్లడించిన గోరంట్ల, అయ్యన్న!
- విజయవాడలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
- స్వార్థపరులకు పదవులు ఇస్తున్నారంటూ గోరంట్ల మండిపాటు
- తామెంతో చేసినా ప్రజలు ఇంకా ఏదో ఆశించి వైసీపీకి ఓటేశారన్న అయ్యన్న
ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం విరివిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా, విజయవాడలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు తమ మనసులో ఉన్నది ఉన్నట్టు అధినేత ముందు మాట్లాడారు. టీడీపీలో సొంత లాభం చూసుకునే వారికి స్థానం కల్పిస్తున్నారని, అలాంటివారికే పదవులు ఇస్తున్నారని గోరంట్ల విమర్శించారు. పార్టీలో ఉన్నప్పుడు బాగా డబ్బు వెనకేసుకుని, పదవులు అనుభవించి వెళ్లిపోతున్నారంటూ మండిపడ్డారు. పార్టీలో మహిళలకు, యువతకు ప్రాధాన్యం లేకుండా పోయిందని నిర్మొహమాటంగా చెప్పేశారు.
అయ్యన్నపాత్రుడు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్పష్టంగా స్పందించారు. ఎవరికైనా ఆకలేసినప్పుడే అన్నం పెట్టాలని, అప్పుడు మాత్రమే అన్నం విలువ తెలుస్తుందని అన్నారు. ఇప్పుడే జనంలోకి వెళితే ప్రయోజనం ఉండదని, ప్రజలకు అవసరమైనప్పుడే జనంలోకి వెళ్లాలని సూచించారు. తమ హయాంలో ప్రజలకు ఎంతో చేసినా, ఇంకా ఏదో కోరుకుని వైసీపీని గెలిపించారని అయ్యన్నపాత్రుడు విశ్లేషించారు.