Hyderabad: ఇంటి ముందు చెట్ల నరికివేత.. యజమానికి జరిమానా విధించిన అటవీశాఖ!
- బంజారాహిల్స్ రోడ్ నెం.12లో సంఘటన
- కమాండ్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఓ భవన నిర్మాణం
- మూడు చెట్లను నరికివేయించిన యజమాని
హైదరాబాద్ లో చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో అధికారులు కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. ఇందుకు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఇటీవల జరిగిన సంఘటనే నిదర్శనం. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో చెట్లను నరికించినందుకు గాను ఓ భవన యజమానికి అటవీ శాఖ అధికారులు జరిమానా విధించారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి ముందు ఉన్న మూడు చెట్లను సంబంధిత యజమాని నరికించి వేశారు. ఈ నేపథ్యంలో అటవీశాఖాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో, అధికారులు కొందరు అక్కడికి వెళ్లి పరిశీలించారు. మూడు చెట్లు నరికినట్టు వారి పరిశీలనలో తేలింది. దీంతో, గత నెల 7న రూ.39,060 జరిమానా విధించడంతో, ఈ నెల 9న ఆ జరిమానాను సదరు యజమాని చెల్లించినట్టు సమాచారం.