KCR: మాట్లాడితే కేసీఆర్ కుటుంబం మీద పడుతున్నారు: విపక్షాలపై నిప్పులు చెరిగిన తలసాని
- కేసీఆర్ కుటుంబ సభ్యులు నామినేటెడ్ పదువుల్లో లేరన్న తలసాని
- వివేక్ బీజేపీలో చేరి ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం
- ఆరేళ్లుగా నిర్వహించని విమోచన దినంపై ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన పనిలేదంటూ వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజక్టు డీపీఆర్ ను ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన అవసరంలేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఎంత అప్పుచేసైనా కట్టే సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని అన్నారు. టీఆర్ఎస్ కు ఎవరు ప్రత్యామ్నాయమో తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఎంఐఎంతో బీజేపీ పోరాటం చేసుకోవచ్చు, మధ్యలో టీఆర్ఎస్ ను అడ్డుపెట్టి మాట్లాడడం ఎందుకని ప్రశ్నించారు.
మాట్లాడితే కేసీఆర్ కుటుంబం మీద పడుతున్నారని, ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని, కేసీఆర్ కుటుంబ సభ్యులేమైనా నామినేటెడ్ పదవుల్లో ఉన్నారా? అని తలసాని మండిపడ్డారు. వెంకటస్వామి ఏ పార్టీకి చెందినవాడైనా గౌరవించి ట్యాంక్ బండ్ పై విగ్రహం ఏర్పాటు చేశామని, ఇప్పుడు ఆయన తనయుడు వివేక్ బీజేపీలో చేరి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా నిర్వహించని విమోచన దినంపై ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరంలేదని తలసాని స్పష్టం చేశారు.