Telugudesam: పాలిచ్చే ఆవుతో చంద్రబాబు తనను పోల్చుకోగానే వంద ఆవులు చనిపోయాయి: వైసీపీ నేత రవిచంద్రారెడ్డి
- టీడీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయమిది
- కానీ, ఆత్మవంచన చేసుకుంటోంది
- ఎలా ఓడిపోయారో చంద్రబాబుకు అర్థం కావట్లేదట!
తెలుగుదేశం పార్టీలో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయంలో ఆత్మవంచన చేసుకుంటూ, పరనింద వేస్తున్నారని వైసీపీ నేత రవిచంద్రారెడ్డి విమర్శించారు. ‘పాలిచ్చే ఆవును వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు’ అన్న బాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. పాలిచ్చే ఆవుతో చంద్రబాబు తనను పోల్చుకున్నారని, అలా, ఆయన పోల్చుకోగానే దాదాపు వంద ఆవులు చనిపోయాయని రవిచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరిపాలించిన అన్ని రోజులు వానలు పడలేదని. కరవు కాటకాలతో ప్రజలు అల్లాడారని అన్నారు. పది సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ గేట్లు తెరిచారని, ప్రకాశం బ్యారేజ్ గేట్లు కూడా తెరిచే పరిస్థితి వచ్చిందని, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని అన్నారు. చంద్రబాబు తీరుకు ఆయన హయాంలో ప్రకృతి కూడా కరుణించలేదని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు చేస్తున్న ప్రదర్శన బాలకృష్ణను మరిపించేలా ఉంది
మొన్నటి ఎన్నికల్లో ఎలా ఓడిపోయామో తనకు అర్థం కావడం లేదని విచిత్రమైన హావభావాలతో చంద్రబాబు చేస్తున్న ప్రదర్శన సినీనటుడు బాలకృష్ణను మరిపించే విధంగా ఉంది. ‘లెజెండ్ నేను .. బాలకృష్ణ బాబు.. మీరు కాదు. నేను ఎంత బాగా యాక్టు చేస్తానో చూడండి’ అని చెప్పే విధంగా అద్భుతమైన నటనా చాతుర్యాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని అన్నారు.